SBI Sanjeevani vehicle circulating in tribal villages of Asifabad district,TG "ముందు జ్వరం వచ్చినా, కళ్ల నొప్పి వచ్చినా డాక్టర్‌ను కలవాలంటే ఖమ్మం వెళ్లాల్సి వచ్చేది. బస్సు లేకపోతే ఆటో పెట్టుకోవాలి. డబ్బులు ఖర్చవుతాయి. ఇప్పుడు మాత్రం డాక్టర్ మా ఊరికే వస్తున్నారు" అని చెబుతున్నారు ఖమ్మం జిల్లా రామన్నరసనగర్‌కు చెందిన మాడత్ గోమ్లి.
భారతదేశం ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించినా, ఇప్పటికీ అనేక మారుమూల గ్రామాలు కనీస వైద్య సేవలకు దూరంగానే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా డాక్టర్ అందుబాటులో ఉండడు. కొందరు ఆర్‌ఎంపీలపై ఆధారపడితే, మరికొందరు సంప్రదాయ మూలికలతోనే చికిత్స చేసుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీలపై మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు కూడా ఇప్పటికీ కనిపిస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితులను మార్చాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఫౌండేషన్ "సంజీవని – క్లినిక్ ఆన్ వీల్స్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వైద్య సేవలను నేరుగా గ్రామాల గుమ్మం ముందుకే తీసుకెళ్తున్నారు.
తెలంగాణలో ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. గ్రామాల్లోకి వెళ్లే ఈ వ్యాన్‌లో డాక్టర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఇతర సిబ్బంది ఉంటారు. రోగుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేస్తారు.
"ప్రజలు ఆసుపత్రికి రావడం లేదు కాబట్టి మేమే వారి దగ్గరకు వెళ్తున్నాం" అని ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, షుగర్, బీపీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. కూలి పనులు, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయని వివరిస్తున్నారు.
అయితే వైద్యం మాత్రమే కాదు, అవగాహన కూడా అంతే ముఖ్యమని వైద్య బృందం భావిస్తోంది. షుగర్, బీపీ వంటి వ్యాధులను కేవలం మందులతో కాకుండా జీవనశైలిలో మార్పులతో కూడా నియంత్రించవచ్చని గ్రామస్తులకు వివరిస్తున్నారు. "చికిత్స కంటే నివారణ మేలు" అనే సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నారు.
నెలకు కనీసం రెండు సార్లు గ్రామాలను సందర్శించే ఈ మొబైల్ క్లినిక్ వల్ల ప్రజలకు పెద్ద ఊరట లభిస్తోంది. గతంలో వందల రూపాయలు ఖర్చు చేసి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉచిత వైద్యం అందుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఒక గ్రామస్తుడు మాట్లాడుతూ, "ముందు షుగర్ స్థాయి చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నెలకు రెండు సార్లు పరీక్షలు చేస్తున్నారు. మందులు ఇస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడింది" అని తెలిపారు.
మరో వృద్ధుడు తన అనుభవాన్ని చెబుతూ, "మా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేదు, అంబులెన్స్ లేదు. అడవిలో దొరికే మూలికలే మందులు. ఇప్పుడు డాక్టర్ మా ఊరికే వస్తున్నాడు. ఇది మా కోసం పెద్ద మార్పు" అని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అంటే కేవలం ఆసుపత్రి భవనం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవ. ఆ సేవను నేరుగా గ్రామస్తుల గుమ్మం ముందు నిలబెట్టి అందిస్తున్న ‘సంజీవని – క్లినిక్ ఆన్ వీల్స్’ ప్రస్తుతం వేలాది మంది జీవితాల్లో ఆరోగ్య భరోసాగా మారుతోంది.
మారుమూల గ్రామాలకు రహదారులు చేరినట్లే, ఇప్పుడు వైద్యం కూడా చేరుతోంది. డాక్టర్ కోసం ప్రజలు ప్రయాణించే రోజులు క్రమంగా తగ్గిపోతుండగా, ప్రజల వద్దకే వైద్యం చేరే కొత్త అధ్యాయానికి ఈ మొబైల్ క్లినిక్ నిదర్శనంగా నిలుస్తోంది. - ShyamMohan Full Video Story- https://youtu.be/k2iAWnmvfp4

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి