3, జూన్ 2026, బుధవారం

ఈ చెట్లకు రంగు రంగుల చీరలు ఎందుకు కట్టారు ? Why Are Colorful Sarees Tied to Mahua Trees?

     


ఈ చెట్లకు రంగు రంగుల చీరలు ఎందుకు కట్టారు ? ఇక్కడ ఏదైనా పండ గా ! జాతరా ? కానీ అదేమీ కాదు, ఇదొక జీవన పోరాటం. కొమ్మలకు పూసిన ఒక్క పువ్వు కూడా నేలపై పడకూడదనే పట్టుదల. అడవిలో ఈ చెట్ల చుట్టూ చీరలే కాదు నైలాన్ వలలు కూడా కడుతున్నారు. ఆకాశం నుంచి రాలే ముత్యాల వంటి పూలను ఒడిసి పడుతున్నారు ఆ పువ్వులు అంత విలువైనవా ? వాటిలో ఏముందీ? సేకరించి ఏమి చేస్తారు ? వారి ఆలోచన వెనక ఉన్న అసలు రహస్యం తెలుసుకోవాలంటే... ఛత్తీస్‌ఘడ్ లోని బస్తర్ అడవుల్లోకి అడుగుపెట్టాల్సిందే! 

 దండకారణ్యంలో అద్భుతమైన చెట్లు పెరుగుతాయి. అవే ఇప్ప చెట్లు ! అవి ప్రకృతి ఇచ్చిన విలువైన సంపద. ఆ పూలలో సహజమైన శక్తివంతమైన పౌష్టిక విలువలు ఉన్నాయి. ఇప్పపూల పానీయం మనుషులను వందేళ్లు ఆరోగ్యంగా బతికిస్తుందంటారు. ఈ పూలలో ఇంత శక్తి ఉందా? అసలు వీటిని ఎలా సేకరిస్తారు? వాటితో వెరైటీ వంటకాలు ఎలా చేస్తున్నారు? బస్తర్ అడవుల నుండి రూరల్ మీడియా స్పెషల్ స్టోరీ

  ఒకపుడు ఇప్ప పూలను నేలమీద పడిన తరువాతే సేకరించేవారు. ఆ సమయంలో దుమ్ము, దూళి అంటి నాణ్యత తగ్గేది. కానీ ఇప్పుడు... సృజనాత్మకంగా ఆలోచించారు బస్తర్ మహిళలు! చెట్లకు చీరెలు, నైలాన్ వలలు కట్టి ... మట్టి అంటకుండా శుభ్రంగా పూలను సేకరిస్తున్నారు. దీంతో నాణ్యత పెరిగింది, ఉత్పత్తులు మరింత స్వచ్ఛంగా తయారవుతున్నాయి. ............................. సేకరించిన పూలను ఒకపుడు నేల మీదనే ఆర బెట్టే వారు... ఇపుడు సోలార్ డ్రయర్‌లో ఎండ బెడుతున్నారు. దీంతో పూల సహజమైన రుచి, ఔషధ విలువలు చెదరకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

  ఆధునిక వంటశాలల్లో, బస్తర్ మహిళలు తమ పాక నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్ప పూలతో లడ్డూలు, కరకరలాడే బిస్కెట్లు తయారు చేస్తున్నారు. అంతే కాదు, టీ సాచెట్స్ కూడా చేస్తూ ఆరోగ్యవంతమైన ఛాయ్ ని రుచి చూపిస్తున్నారు. ఈ ఉత్పత్తులలో రుచితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇప్ప పూలలో చిన్నారుల్లో రక్త హీనతను తగ్గించి, కంటి చూపును మెరుగు పరిచే ఔషధ గుణాలున్నాయి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ తో నిండిన సూపర్‌ఫుడ్ ఇది. తెలంగాణలోని కొత్తగూడెంలో ఇప్ప చాక్లెట్లు , ఉట్నూరులో లడ్డూలు, బర్ఫీలు తయారు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మన్యంలో ఇప్ప గింజల నుండి తైలం కూడా తీస్తున్నారు. ఇది మోకాలి నొప్పుల నివారణకు అమోఘంగా పనిచేస్తుందని అక్కడి ఆదివాసీలు నమ్ముతారు. 

 . అడవుల్లో సహజంగా పెరిగే ఇప్ప చెట్లు పేదలకు జీవనాధారమయ్యాయి. ఆదివాసీలు అటవీ సంపదను కాపాడుతూ, సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కొత్త తరానికి విలువైన పోషకాహారాన్ని అందిస్తు ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తున్నారు. 

ఇప్ప చెట్టు నిజంగా... అద్భుతమైన జీవన చెట్టు! Video link- https://youtu.be/Ow_8azU9YCE

1, జూన్ 2026, సోమవారం

ఈ వ్యాన్ గ్రామాల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతోంది? | Rural Media Ground Report

 

   
SBI Sanjeevani vehicle circulating in tribal villages of Asifabad district,TG "ముందు జ్వరం వచ్చినా, కళ్ల నొప్పి వచ్చినా డాక్టర్‌ను కలవాలంటే ఖమ్మం వెళ్లాల్సి వచ్చేది. బస్సు లేకపోతే ఆటో పెట్టుకోవాలి. డబ్బులు ఖర్చవుతాయి. ఇప్పుడు మాత్రం డాక్టర్ మా ఊరికే వస్తున్నారు" అని చెబుతున్నారు ఖమ్మం జిల్లా రామన్నరసనగర్‌కు చెందిన మాడత్ గోమ్లి.

భారతదేశం ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి సాధించినా, ఇప్పటికీ అనేక మారుమూల గ్రామాలు కనీస వైద్య సేవలకు దూరంగానే ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా డాక్టర్ అందుబాటులో ఉండడు. కొందరు ఆర్‌ఎంపీలపై ఆధారపడితే, మరికొందరు సంప్రదాయ మూలికలతోనే చికిత్స చేసుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీలపై మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు కూడా ఇప్పటికీ కనిపిస్తుంటాయి.

ఇలాంటి పరిస్థితులను మార్చాలనే లక్ష్యంతో ఎస్‌బీఐ ఫౌండేషన్ "సంజీవని – క్లినిక్ ఆన్ వీల్స్" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వైద్య సేవలను నేరుగా గ్రామాల గుమ్మం ముందుకే తీసుకెళ్తున్నారు.

తెలంగాణలో ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది. గ్రామాల్లోకి వెళ్లే ఈ వ్యాన్‌లో డాక్టర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఇతర సిబ్బంది ఉంటారు. రోగుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా చేస్తారు.

"ప్రజలు ఆసుపత్రికి రావడం లేదు కాబట్టి మేమే వారి దగ్గరకు వెళ్తున్నాం" అని ఈ కార్యక్రమంలో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, షుగర్, బీపీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. కూలి పనులు, శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయని వివరిస్తున్నారు.

అయితే వైద్యం మాత్రమే కాదు, అవగాహన కూడా అంతే ముఖ్యమని వైద్య బృందం భావిస్తోంది. షుగర్, బీపీ వంటి వ్యాధులను కేవలం మందులతో కాకుండా జీవనశైలిలో మార్పులతో కూడా నియంత్రించవచ్చని గ్రామస్తులకు వివరిస్తున్నారు. "చికిత్స కంటే నివారణ మేలు" అనే సందేశాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నారు.

నెలకు కనీసం రెండు సార్లు గ్రామాలను సందర్శించే ఈ మొబైల్ క్లినిక్ వల్ల ప్రజలకు పెద్ద ఊరట లభిస్తోంది. గతంలో వందల రూపాయలు ఖర్చు చేసి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉచిత వైద్యం అందుతోందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఒక గ్రామస్తుడు మాట్లాడుతూ, "ముందు షుగర్ స్థాయి చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నెలకు రెండు సార్లు పరీక్షలు చేస్తున్నారు. మందులు ఇస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడింది" అని తెలిపారు.

మరో వృద్ధుడు తన అనుభవాన్ని చెబుతూ, "మా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేదు, అంబులెన్స్ లేదు. అడవిలో దొరికే మూలికలే మందులు. ఇప్పుడు డాక్టర్ మా ఊరికే వస్తున్నాడు. ఇది మా కోసం పెద్ద మార్పు" అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అంటే కేవలం ఆసుపత్రి భవనం కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే సేవ. ఆ సేవను నేరుగా గ్రామస్తుల గుమ్మం ముందు నిలబెట్టి అందిస్తున్న ‘సంజీవని – క్లినిక్ ఆన్ వీల్స్’ ప్రస్తుతం వేలాది మంది జీవితాల్లో ఆరోగ్య భరోసాగా మారుతోంది.

మారుమూల గ్రామాలకు రహదారులు చేరినట్లే, ఇప్పుడు వైద్యం కూడా చేరుతోంది. డాక్టర్ కోసం ప్రజలు ప్రయాణించే రోజులు క్రమంగా తగ్గిపోతుండగా, ప్రజల వద్దకే వైద్యం చేరే కొత్త అధ్యాయానికి ఈ మొబైల్ క్లినిక్ నిదర్శనంగా నిలుస్తోంది.                                                                           - ShyamMohan                                                                                                                                             Full Video Story-  https://youtu.be/k2iAWnmvfp4

AI భవిష్యత్తు కావచ్చు. కానీ నీరు జీవితం.

 

                     Journalist Shyam Mohan documenting groundwater depletion in

                                                        Wanaparthy district, Telangana.
డేటా సెంటర్ల దిశగా తెలంగాణ పరుగులు — అభివృద్ధి ఎంత? ప్రమాదం ఎంత?

ఒకప్పుడు బొగ్గు గనులు, పెద్ద పరిశ్రమలు, రహదారులు అభివృద్ధికి చిహ్నాలుగా కనిపించేవి. ఇప్పుడు కాలం మారింది. ప్రపంచం మొత్తం “సమాచారం” చుట్టూ తిరుగుతోంది. మనం మొబైల్‌లో చూసే వీడియోలు, బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వ సేవలు, కృత్రిమ మేధ, వైద్య సమాచారం ఇవన్నీ ఎక్కడో భారీ కంప్యూటర్ భవనాల్లో నిల్వ ఉంటాయి. వాటినే “డేటా సెంటర్లు” అంటున్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అలాంటి భారీ సమాచార కేంద్రాల గమ్యస్థానంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా “ఫ్యూచర్ సిటీ” పేరుతో కొత్త ప్రణాళికలు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పైకి చూస్తే ఇది గొప్ప అవకాశంలా కనిపిస్తోంది. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కానీ మరోవైపు నీరు, విద్యుత్, పర్యావరణంపై తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవుతున్నాయి.అభివృద్ధి పేరుతో భవిష్యత్తులో కొత్త సమస్యలకు తలుపులు తెరవబోతున్నామా? లేక నిజంగానే సుస్థిరమైన సాంకేతిక అభివృద్ధి దిశగా వెళ్తున్నామా? అనే ప్రశ్న ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ సమాచార కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీ కంప్యూటర్ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్థిరమైన విద్యుత్ సరఫరా, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువత, ఇతర మహానగరాలతో పోలిస్తే తక్కువ భూమి ధరలు. ప్రభుత్వ వేగవంతమైన అనుమతులు కూడా విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. 

హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా చందన్‌వెల్లి–మహేశ్వరం belt, దేశంలో వేగంగా ఎదుగుతున్న డేటా సెంటర్ హబ్‌గా మారుతున్నాయి. AWS, Microsoft, CtrlS వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ల నిర్మాణం లేదా విస్తరణ చేపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కొన్ని సంఖ్యలు, భూవిస్తీర్ణ వివరాలకు అధికారిక ధృవీకరణ అవసరం.

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ వినియోగం పెరుగుతోంది. ప్రతి రోజు కోట్లాది ఫొటోలు, వీడియోలు, లావాదేవీలు, ప్రభుత్వ పత్రాలు డిజిటల్ రూపంలో నిల్వ అవుతున్నాయి. అందుకే పెద్ద దేశాలు ఇప్పుడు సమాచార నిల్వ కేంద్రాల కోసం కొత్త ప్రదేశాలను వెతుకుతున్నాయి. తెలంగాణ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది.అయితే ఈ అభివృద్ధి వెనుక కనిపించని మరో పెద్ద నిజం ఉంది. ఈ భారీ కేంద్రాలు వేలాది కంప్యూటర్లతో నిండి ఉంటాయి. అవి నిరంతరం పనిచేయడం వల్ల తీవ్రమైన వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడిని తగ్గించడానికి పెద్ద మొత్తంలో విద్యుత్, నీరు అవసరం అవుతుంది. ఒక పెద్ద సమాచార కేంద్రం చిన్న పట్టణం వినియోగించేంత విద్యుత్‌ను ఉపయోగించగలదని నిపుణులు చెబుతున్నారు.నీటి వినియోగం మరింత ఆందోళన కలిగించే అంశం. చల్లబరచే వ్యవస్థల కోసం రోజుకు లక్షల లీటర్ల నీరు అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇవి భూగర్భ జలాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉంది. గ్రామాల్లో బోర్లు ఎండిపోవడం, వ్యవసాయానికి నీటి కొరత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం.

ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ సమస్యను గమనించాయి. విద్యుత్ వినియోగం, నీటి కొరత, గాలి కాలుష్యం పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో కొత్త డేటా సెంటర్లపై పరిమితులు విధించడం ప్రారంభమైంది. ముఖ్యంగా స్థానిక ప్రజలకు పెద్దగా ఉపాధి రాకపోయినా, సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతోందనే విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రపంచం “పచ్చ సమాచార కేంద్రాలు” అనే దిశగా ఆలోచిస్తోంది. 

అంటే సూర్యశక్తి, గాలిశక్తి వంటి పునరుత్పాదక విద్యుత్ వినియోగం, మళ్లీ శుద్ధి చేసిన నీటి వాడకం, తక్కువ వేడి ఉత్పత్తి చేసే సాంకేతిక పద్ధతులు ఉపయోగించడం.తెలంగాణ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవాలి. లేదంటే “డిజిటల్ అభివృద్ధి” పేరుతో రేపటి నీటి సంక్షోభానికి కారణం కావచ్చు.ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలి. భూగర్భజలాలను అధికంగా వినియోగించకుండా నియంత్రణలు ఉండాలి. శుద్ధి చేసిన మురుగు నీటినే ఉపయోగించే విధానాన్ని తప్పనిసరి చేయాలి.  

సౌర/విండ్ విద్యుత్  వినియోగాన్ని నిర్బంధంగా అమలు చేయాలి. ప్రతి కేంద్రం నీటి వినియోగం, విద్యుత్ వినియోగం, గాలి కాలుష్యం వివరాలను ప్రజలకు వెల్లడించాలి. పాత కంప్యూటర్ పరికరాల వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విధానం ఉండాలి.అత్యంత ముఖ్యంగా, ఇలాంటి ప్రాజెక్టుల ముందు పరిసర గ్రామాలపై ప్రభావాన్ని అధ్యయనం చేసే పర్యావరణ పరిశీలన నిజాయితీగా జరగాలి. కేవలం పెట్టుబడుల సంఖ్య చెప్పడం కాదు, ప్రజల భవిష్యత్తు కూడా ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

  డేటా సెంటర్ల విస్తరణ తెలంగాణకు ఒకవైపు భారీ పెట్టుబడులు, డిజిటల్ మౌలిక వసతులు తీసుకొస్తుండగా, మరోవైపు విద్యుత్  నీటి వినియోగంపై ఆందోళనలు కూడా పెంచుతోంది. డేటా సెంటర్లు ఏర్పడితే నిర్మాణ రంగం, ఎలక్ట్రికల్, భద్రత, నిర్వహణ, ఫైబర్ నెట్‌వర్క్ సేవల్లో ప్రత్యక్షపరోక్ష ఉద్యోగాలు వస్తాయి. క్లౌడ్ సేవలు, AI, ఐటీ కంపెనీలు రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టే అవకాశమూ ఉంటుంది. అయితే ఇవి భారీగా విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఒక పెద్ద డేటా సెంటర్ చిన్న పట్టణం వినియోగించేంత విద్యుత్ అవసరం పడొచ్చు. సర్వర్లు వేడెక్కకుండా కూలింగ్ కోసం నీటి వినియోగం కూడా గణనీయంగానే ఉంటుంది. అందువల్ల భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి, నీటి వనరులు, పర్యావరణ ప్రభావం వంటి అంశాలు కీలక చర్చగా మారే అవకాశం ఉంది. 

మరో ముఖ్యమైన ప్రశ్న  స్థానిక యువతకు నిజంగా ఎంతమేర ఉద్యోగాలు వస్తాయి? అధిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలు ఎక్కువగా ఉండటంతో, స్థానికంగా స్కిల్ ట్రైనింగ్ పెంచకపోతే పెద్ద ప్రయోజనం బయటివారికే పరిమితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 సాంకేతిక అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించలేరు. భవిష్యత్తు ప్రపంచంలో సమాచార నిల్వ కేంద్రాలు కూడా అవసరమే. కానీ ప్రకృతిని నాశనం చేసి వచ్చే అభివృద్ధి చివరికి సమాజానికే భారమవుతుంది.తెలంగాణ ముందు ఇప్పుడు అసలు పరీక్ష ఇదే 

“ఎక్కువ డేటా సెంటర్లు నిర్మించడమా?”  లేక “ప్రజల నీరు, నేల, గాలిని కాపాడుకుంటూ సుస్థిర అభివృద్ధికి ఆదర్శంగా నిలవడమా?”

ఈ ప్రశ్నకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే రేపటి తెలంగాణ రూపాన్ని నిర్ణయించబోతున్నాయి..

.......శ్యాంమోహన్

ఈ చెట్లకు రంగు రంగుల చీరలు ఎందుకు కట్టారు ? Why Are Colorful Sarees Tied to Mahua Trees?

      ఈ చెట్లకు రంగు రంగుల చీరలు ఎందుకు కట్టారు ? ఇక్కడ ఏదైనా పండ గా ! జాతరా ? కానీ అదేమీ కాదు, ఇదొక జీవన పోరాటం. కొమ్మలకు పూసిన ఒక్క...