నేను ఒక ప్రముఖ మీడియా సంస్ధలో పని చేస్తున్నపుడు ఒక రోజు ఎడిటోరియల్ మీటింగ్‌లో ... ‘ మారు మూల ప్రాంతాలకి వెళ్తే తాగు నీళ్లు లేని ఊర్లు, డాక్టర్లు లేని ఆవాసాలు , కనీసం అంగన్ వాడీ స్కూల్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి సార్. అవి కవర్ చేస్తే మన \పత్రిక కు మంచి పేరు వస్తుంది.’ అని అన్నాను.
‘ పేరొస్తే సరిపోదు. యాడ్స్ కూడా రావాలి. ఆ యాంగిల్ లో ఏమైనా స్టోరీలు ఉంటే వర్కవుట్ చేయి...’ అని వాళ్లన్నారు. ఇదీ వర్తమాన జర్నలిజం.
కొంత కాలం తరువాత ఆ మీడియా కంపెనీకి గుడ్‌బై చెప్పి, కొత్త గూడెం ఆదివాసీ ఆవాసాల వైపు బయలు దేరాం. రెండు రోజులు అక్కడ దొరికిందే తిని, తునికి చెట్ల నీడలో ఉంటూ, తాగునీటి కోసం అక్కడి మహిళల కష్టాలు ఒక వీడియో రిపోర్ట్ చేశాం. 32 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ( VideoLink https://youtu.be/xn0mz4cpqR4?si=CX8Tc6w57FMf-YH0 )
దీని వల్ల సమాజం మారుతుందో లేదో తెలీదు కానీ, జర్నలిస్టులు ఎవరి కోసం నిలబడాలో మాకు అర్ధం అయింది! అక్కడి తాగునీటి సమస్యలను తీర్చడానికి కొన్ని ఎన్జీఓలు ముందుకు వచ్చాయి.
రూరల్ మీడియా దృష్టికోణం :
మావన్నీ ఊరి చివరి, కొండ చివరి,లోయ లోపలి కథలు సాధారణంగా ఏ కథ అయినా ఊరి మధ్య నుండి చూపిస్తారు. కానీ మేం రూరల్ మీడియాలో ఊరి చివరి జీవితం చూపిస్తాం. ఊరి చివర ఉండేవారి కథలు సాధారణ మీడియాలో కనిపించవు. అసలు ఊరి చివర ఒక కథ ఉంటుంది అని మీడియాలో చూపించడం చాలా అరదు.
అలా మేం క్యాప్చర్ చేసినదే కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలంలో కొండ చివర ఉన్న అయ్య కొండ స్టోరీ. అక్కడ బడి ముందు, ఇళ్ల ముందే సమాధులుంటాయి. పిల్లలు వాటి మీద ఆడుకుంటారు. బీబీసికి పంపాను.
‘ఈ గ్రామంలో ప్రతీ ఇంటి ముందు సమాధులు ఎందుకున్నాయి? ’ అనే శీర్షికతో 2018 లో పబ్లిష్ అయి తెలుగుతో సహా 5 భారతీయ ( మరాఠీ,పంజాబీ,తమిళ్,హిందీ, ఉర్దూ ) భాషల్లోకి అనువాదం అయింది.
- ShyamMohan

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి