రోడ్ పక్కనే టీ తీసుకొని ఉదయం 5 గంటలకే బయలు దేరాం.
‘ బెన్నేడు బంద చేరుకోవాలి అంటే కొండ మీద రెండున్నర కిలో మీటర్లు నడవాలి. టూవీలర్ కూడా వెళ్లలేని చిన్న కాలిబాటలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. పక్కనే లోయ ఉంటుంది...’ అని హెచ్చరించారు రోజ్ మేరీ. ఆమె అమృతా వెల్ఫేర్ సొసైటీలో ఫీల్డ్ కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. తూరుపు కనుమల్లో ఆదివాసీలకు మెరుగైన జీవనం, అక్కడి వ్యవసాయ అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు.
‘ మా ప్రాంతం మీరు ఒక సారి తప్పక చూడాలి. మీకు తెలీని జీవితం, సమస్యలు అనేకం చూస్తారు.’ అని ఆమె మాకు గతంలో ఒక సారి చెప్పారు.
అలా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా , పాడేరు వచ్చాం.
దాదాపు గంట తరువాత ఆమె చెప్పిన గ్రామం దగ్గర రోడ్డు పక్కనే మా వాహనం ఆగింది.
‘ ఇక్కడి కాలి నడకన కొండ ఎక్కితే బెన్నేడు బంద వస్తుంది..’ అని ఆమె ముందుకు సాగింది. అమె వెనుకే మా టీమ్ అడుగులు వేశారు. కొందరు కొండ దిగుతూ మాకు కనిపించారు. ఎందాక అని అడిగితే పాడేరులో ఆసుపత్రికి పోతున్నాం అయ్యా... మీకు ఈ దారి కొత్త.జాగత్తగా అడుగులు వేయండి. బ్యాలన్స్ తప్పితే పక్కనే లోయలోకి జారిపోతాం. అని జాగ్రత్తలు చెప్పారు. అన్నారు.
లోయ అంచులో నడుస్తూ , చెట్ల కొమ్మల మీది నుండి మా వైపు చూస్తున్న పసిరిక పాముల నుండి తప్పించుకుంటూ అతి కష్టంగా ఆయాస పడుతూ కొండమీద పల్లెకు చేరుకున్నాం.
అక్కడే 40 ఏండ్లుగా 12 కుటుంబాలు బతుకుతున్నాయి.
‘రేషన్ సరుకులు కోసం, రోగాలు వస్తే చూపించుకోవడానికి ఈ కొండదిగి ఎక్కాల్సిందే మరో దారి లేదు. 15 మంది స్కూల్ పిల్లలు ఉంటారు. బడికి వెళ్లాలంటే రెండున్నర కిలో మీటర్లు కొండ దిగి వెళ్లాలి, కనీసం అటో వెళ్లడానికి రోడ్ వేయమని అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు మొర పెట్టుకున్నాం . పట్టించుకునే నాధుడే లేడు ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ అందటం లేదు. ’ అన్నాడు మమ్మల్ని చూసిన గ్రామస్తుడు గమ్మిలి రాజబాబు.
.............................................................................................
దట్టమైన అడవుల మధ్య తూరుపు కనుమల్లో చిక్కుకున్న రెండు పల్లెలు బెన్నేడు బంధ, వరంకుర. అక్కడి పిల్లలు బడికి వెళ్లి .... రావాలంటే 5 కిలో మీటర్లు నడవాలి.
కొందరి పాదాలకు చెప్పులు కూడా ఉండవు! ఈ అడవిలో ఏమి జరిగినా పిల్లలను కాపాడే దిక్కు లేదు! పెద్దలకు రోగాలు వస్తే డోలీలో మోసుకు వెళ్లాల్సిందే !
ఇంతటి ప్రమాదకరమైన పరిస్ధితుల్లో రూరల్ మీడియా టీమ్ అక్కడికి వెళ్లింది!
చిన్నారులకు విద్య అంటే అందమైన కల! కానీ ఈ ఆదివాసీ బిడ్డలకు ఒక పీడకల!
బడికి వెళ్లడానికి రోజూ పోరాటం చేయాలి. కొందరి పాదాలకు చెప్పులు కూడా లేని ధైన్య స్ధితి !
“ఇక్కడ విద్యేకాదు, వైద్యం కూడా లేదు. అనారోగ్యం ఈ గ్రామానికి శాపం. రోగాలు వస్తే, డోలీతో రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఏమాత్రం ఆలస్యం అయినా జీవితాలు కోల్పోతుంటారు. ఇక్కడ ప్రతి రోజూ, ప్రతి అడుగూ... ఒక జీవన్మరణ పోరాటమే. ప్రభుత్వం మా కష్టాలు చూసి రహదారి సౌకర్యం కల్పిస్తే చాలు . వీరి కష్టాలు కొంత తీరుతాయి’ అని రోజ్ మేరీ గ్రామస్తులను మాకు పరిచయం చేస్తూ చెప్పారు.
‘ వానలు పడితే ఈ దారిలో నడవలేం ... బురదలో జారిపడి దెబ్బలు తగిలిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మాకు మరుగు దొడ్లు కూడా లేవు...’ అని అక్కడి మహిళలు మాతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే ఈ కొండ ప్రజలకు ఎన్ని కష్టాలున్నా వారు ప్రకృతికి కొంచెం కూడా హాని చేయరు!
ఘన, ద్రవజీవామృతం వంటి జీవన ఎరువులతో కాఫీ, రాగులు, కూరగాయలు పండిస్తారు.
కొండ నేలలో సారం పెంచుతారు. ఈ ప్రజలు పెద్ద కోరికలేమీ కోరడం లేదు.
కనీసం ఆటో వెళ్లడానికి రహదారి, వైద్యం, విద్య ... అంతే!
ఇవి... అడవిబిడ్డలకు ... కనీస మానవ హక్కులు ... కాదంటారా? ( Full Video link- https://youtu.be/LZsdnRAU4tU
... శ్యాంమోహన్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి